–స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా
సలాం ప్రొద్దుటూరు – కడప:
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కడపలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (MANUU) పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గురువారం పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా మూడు స్ట్రాంగ్ రూమ్‌లు, మూడు ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్, కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సామగ్రికి పటిష్టమైన భద్రత కల్పించాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఈ పరిశీలనలో కడప నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, కడప డీఎస్పీ టి. భవానీ తదితరులు పాల్గొన్నారు.

