–మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఘన సన్మానం
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ యంత్రాంగం చేపడుతున్న చర్యలను అభినందిస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ చర్యలు చేపడుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజలతో కమిషనర్ ముఖాముఖి’ కార్యక్రమం ద్వారా ప్రజలకు తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు.
మీడియా సహకారంతో ప్లాస్టిక్ రహిత ఉద్యమానికి విస్తృత ప్రచారం
సన్మానానికి స్పందించిన కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు’ సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ఈ లక్ష్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం తీసుకున్నామని తెలిపారు.అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సహకారంతో రూపొందించిన రీల్స్ విస్తృతంగా వైరల్ కావడంతో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు సంకల్పం ప్రజల్లోకి మరింత వేగంగా చేరిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మీడియా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరింత సమన్వయం
ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం, నిషేధిత ప్లాస్టిక్‌కు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం వంటి కార్యక్రమాలకు ప్రజలు, వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత విధానాలను అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు.‘ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు’ అడ్వైజరీ కమిటీలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పట్టణంలో ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను మరింత సమన్వయంతో నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని కమిషనర్ తెలిపారు.మున్సిపల్ యంత్రాంగం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు వి. మునిశేఖర్ రెడ్డి, చైర్మన్ శ్రీమతి వి. కళావతి, డైరెక్టర్ ఎస్. శ్రీనివాసులు, సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

