
–40 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులకు శ్రీకారం
–రానున్న రోజుల్లో డ్రైనేజీ, నీటి పైపులైన్లు, సీవరేజ్ ట్రీట్‌మెంట్‌కు మరో రూ.252 కోట్ల పనులు చేపడతామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వెల్లడి
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.40 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి వర్చువల్ కార్యక్రమం నిర్వహించగా, ప్రొద్దుటూరు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొన్నారు.
రూ.252 కోట్లతో తదుపరి దశ పనులు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత రూ.40 కోట్ల పనులతో పట్టణంలోని రహదారులు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రూ.252 కోట్ల అంచనా వ్యయంతో డ్రైనేజీలు, నీటి పైపులైన్లు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ పనులను UFIDC ద్వారా చేపట్టే ప్రణాళిక ఉందని వెల్లడించారు.పట్టణ సమగ్ర అభివృద్ధికి దశలవారీగా పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత పాలనపై ఎమ్మెల్యే విమర్శలు
సభలో ఎమ్మెల్యే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. గత పాలనలో ప్రొద్దుటూరులో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా జగనన్న కాలనీ భూసేకరణలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని, పేదలకు ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పిలుపు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు పరిశీలించాలని, వాటి ఆధారంగా తమ నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పలువురు నాయకులు, అధికారులు హాజరు
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తియార్, పురపాలక కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు కొండవీటి భావన, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

