అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో స్వచ్ఛతా హీ సేవా – రెండో రోజు కార్యక్రమం
–ప్లాస్టిక్ నివారణ, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అవగాహన
సలాం ప్రొద్దుటూరు:
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పాల్గొని విద్యార్థులకు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో కమిషనర్ ముచ్చటిస్తూ భారతదేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర, సమాజ నిర్మాణంలో యువత బాధ్యతను వివరించారు. పట్టణ పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, చెత్తను తడి–పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఇంటి నుంచే స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాలి
ప్రతి విద్యార్థి తన ఇంటి నుంచే స్వచ్ఛతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కమిషనర్ సూచించారు. కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు కూడా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని కోరారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి స్వచ్ఛత, ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణపై వారి అభిప్రాయాలను కమిషనర్ తెలుసుకున్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పరిశుభ్రతపై బాధ్యత పెంపొందిస్తే భవిష్యత్తులో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
