
–విశ్వేశ్వరయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
–విద్యార్థులకు ప్రిన్సిపాల్ పాలెం గురుమూర్తి రెడ్డి సూచన
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 59వ ఇంజనీర్స్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. 1995–98 మెకానికల్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. పూర్వ విద్యార్థులు మిఠాయిలు పంచిపెట్టి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్, పూర్వ విద్యార్థుల సమన్వయకర్త పాలెం గురుమూర్తి రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంటేరు శ్రీనివాసులు రెడ్డిను విద్యార్థులు, పూర్వ విద్యార్థులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఇంజనీర్ల పాత్ర కీలకం
ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే ప్రాముఖ్యతను వివరించిన పాలెం గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశానికి విశిష్ట సేవలందించిన గొప్ప ఇంజనీర్, మేధావి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు.
దేశాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతుల కల్పనతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విశ్వేశ్వరయ్య క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం, సాంకేతిక నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచారని, ఆయన జీవితం ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి ఆదర్శప్రాయమని అన్నారు.
ప్రస్తుత విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ఆలోచన, నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు.
పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయం
తమ విద్యాభ్యాసానికి పునాది వేసిన కళాశాలను, అప్పట్లో తమకు విద్యాబోధన చేసిన అధ్యాపకులను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల అనుభవాలు, సాంకేతిక రంగంలో వారు సాధించిన ప్రగతి ప్రస్తుత విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, పూర్వ విద్యార్థులు బాబు, నాగరాజు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

