ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం

జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం

📰 Generate e-Paper Clip

 

–2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం..

–12 విభాగాల్లో పురస్కారాలు

 

–₹1 లక్షల నుంచి ₹2 లక్ష వరకు నగదు బహుమతులు.. సెప్టెంబర్‌ 28లోగా దరఖాస్తులు

 

సలాం ప్రొద్దుటూరు –విజయవాడ:

జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ వృత్తిపరమైన ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి సంబంధించి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు.అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబర్‌ 28 సాయంత్రం 5 గంటల్లోగా డైరెక్టర్‌, సమాచార పౌరసంబంధాల శాఖ, 2వ అంతస్తు, ఎన్టీఆర్‌ పరిపాలన భవనం, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌, విజయవాడ–520013 చిరునామాకు పంపించాలని సూచించారు.

మూడు అవార్డులకు ప్రత్యేక దరఖాస్తులు అవసరం లేదు

వి.ఆర్. నార్ల జీవిత సాఫల్య పురస్కారం, కొక్కు అహోబలరావు ఉత్తమ ఫోటో జర్నలిస్టు అవార్డు, మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డులకు జర్నలిస్టుల నుంచి ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించరు. ఈ మూడు అవార్డులకు ఎంపిక కమిటీ తన విచక్షణాధికారంతో అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తుంది.

దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసే అవార్డులు

కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు రూ.2 లక్షల నగదు పురస్కారం అందజేస్తారు. జర్నలిజం వృత్తిలో కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగిన పూర్తికాలపు జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డులు మూడు అందజేస్తారు. ఖాసా సుబ్బారావు, ముట్నూరి కృష్ణారావు, మద్దుకూరి చంద్రశేఖరరావు పేర్లతో ఒక్కో అవార్డుకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న జర్నలిస్టులతో పాటు గ్రామీణ జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన మాజీ జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

సావిత్రిబాయి పూలే ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డుకు రూ.లక్ష నగదు పురస్కారం ఉంటుంది. రాష్ట్రంలో వెలువడే తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు, పీరియాడికల్స్‌లో పనిచేస్తున్న మహిళా రిపోర్టర్లు, డెస్క్‌ జర్నలిస్టులు అర్హులు.

ఉత్తమ కార్టూనిస్టు అవార్డుకు రూ.లక్ష నగదు పురస్కారం అందజేస్తారు. కనీసం పదేళ్ల అనుభవం ఉన్న కార్టూనిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అబుల్‌ కలాం ఆజాద్‌ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డుకు రూ.లక్ష నగదు పురస్కారం ఉంటుంది. ఉర్దూ జర్నలిజంలో కనీసం పదేళ్ల అనుభవం ఉన్నవారి వృత్తిపరమైన సేవలు, గ్రామీణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చేసిన రిపోర్టింగ్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు.

ఉత్తమ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టు అవార్డుకు రూ.లక్ష నగదు పురస్కారం ఉంటుంది. కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానళ్లు, కేబుల్‌ నెట్‌వర్క్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులతో పాటు దూరదర్శన్‌, రేడియోలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా అర్హులు.

ఉత్తమ వీడియో జర్నలిస్టు అవార్డుకు రూ.లక్ష నగదు పురస్కారం అందజేస్తారు. ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానళ్లలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న వీడియో జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2025లో ప్రచురితమైన/ప్రసారమైన క్లిప్పింగ్స్‌ తప్పనిసరి

దరఖాస్తుదారులు తాము పనిచేస్తున్న సంస్థ, ఉద్యోగ వివరాలు, అర్హతలకు సంబంధించిన పూర్తి సమాచారంతో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు 2025 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు ప్రచురితమైన లేదా ప్రసారమైన కనీసం ఐదు వ్యాసాలు, వార్తా కథనాలు, ఫొటోలు, కార్టూన్లు లేదా వీడియో క్లిప్పింగ్స్‌ను సమర్పించాలి. వ్యాసాలు, వార్తా కథనాలను ఫొటోకాపీల రూపంలో కూడా అందజేయవచ్చు.

అవార్డు గ్రహీతల ఎంపికలో ఎంపిక కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని అధికారులు తెలిపారు. తగిన సంఖ్యలో లేదా ప్రమాణాలతో దరఖాస్తులు అందలేదని కమిటీ భావించిన విభాగంలో అవార్డును ప్రకటించకుండా నిలిపివేసే అధికారం కమిటీకి ఉంటుందని పేర్కొన్నారు.

పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనల కోసం సమాచార పౌరసంబంధాల శాఖ మీడియా రిలేషన్స్‌ వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!