–నలుగురికి ‘ఉత్తమ లైబ్రేరియన్ అవార్డులు–2026’ ప్రదానం
–ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో ఘన సత్కారం
సలాం ప్రొద్దుటూరు – కడప:
వైఎస్ఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, గ్రంథాలయ సేవల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఉద్యోగులకు ‘ఉత్తమ లైబ్రేరియన్ అవార్డులు–2026’ ప్రదానం చేశారు.వైఎస్ఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భాను ప్రకాష్, కార్యదర్శి సయ్యద్ అమీరుద్దీన్ చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు పౌర గ్రంథాలయ శాఖ జారీ చేసిన ప్రశంసాపత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.ప్రొద్దుటూరుకు చెందిన లైబ్రేరియన్ గ్రేడ్–1 టి. తిరుపతమ్మ, జమ్మలమడుగుకు చెందిన లైబ్రేరియన్ గ్రేడ్–2 నాదెండ్ల బాబ్జి, చాపాడు లైబ్రేరియన్ జె. శివశంకర్ రెడ్డి, కడప జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ కె. సుబ్బమ్మ అవార్డులకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్, కార్యదర్శి మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థులు, యువత, పాఠకులకు విజ్ఞాన కేంద్రాలుగా మరింత సమర్థవంతంగా సేవలందించేలా ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.అవార్డు గ్రహీతలు సంచాలకులు ఎ. కృష్ణ మోహన్, చైర్మన్ దాసరి భాను ప్రకాష్, కార్యదర్శి సయ్యద్ అమీరుద్దీన్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం కడప జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కొమ్మద్ధి నవాబ్ జాన్, జిల్లా కోశాధికారి ఎస్. సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. ఇబ్రహీంతో పాటు గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది అవార్డు గ్రహీతలను అభినందించారు.
