

–మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రోజా దర్గాలో రక్తదాన శిబిరం
–తలసేమియా బాధితుల కోసం 30 మంది రక్తదానం.. పవిత్ర కేశాల దర్శనానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
సలాం ప్రొద్దుటూరు కర్నూల్:
మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూల్ లోని ప్రసిద్ధ రోజా దర్గాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దర్గా ముత్తవల్లి, పీఠాధిపతి సయ్యద్ షా దాదాభాష్ ఖాద్రి సహకారంతో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా, అనంతరం ప్రవక్త మహమ్మద్ (స) పవిత్ర కేశాలు ముయే ముబారక్‌ను భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.రోజా దర్గా ప్రాంగణంలోని సనా ఫంక్షన్ హాల్‌లో న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ మేనేజర్ ముక్తార్ భాషా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ షా జావిద్ భాషా ఖాద్రి మాట్లాడుతూ.. ముత్తవల్లి, పీఠాధిపతి సయ్యద్ షా దాదాభాష్ ఖాద్రి ఆదేశాలు, సహకారంతో ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
నాలుగేళ్లుగా సేవా కార్యక్రమం
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా గత నాలుగేళ్లుగా వరుసగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని సయ్యద్ షా జావిద్ భాషా ఖాద్రి తెలిపారు. దర్గా తరఫున సేకరించిన రక్తాన్ని తలసేమియా బాధితులకు అందించి, వారి ప్రాణాలను కాపాడే మహత్తర సేవలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు.రక్తదాన శిబిరంలో 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సమాజంలో రక్తదానం పట్ల మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బందులు పడుతున్న బాధితులకు రక్తదాతలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ షా రియాజ్ ఖాద్రి, ఖలీలుల్లా ఖాద్రి, దర్గా నిర్వాహకులు, భక్తులు, రక్తదాతలు, న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు ముయే ముబారక్ దర్శనం
మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటలకు ప్రవక్త మహమ్మద్ (స) పవిత్ర కేశాలు ముయే ముబారక్‌ను భక్తుల దర్శనార్థం ఉంచారు. పవిత్ర ముయే ముబారక్‌ను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు రోజా దర్గాకు తరలివచ్చారు.పవిత్ర కేశాల దర్శనం సందర్భంగా భక్తులు భక్తిభావంలో మునిగిపోయారు. దర్గా ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు పవిత్ర ముయే ముబారక్‌ను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మిలాద్-ఉన్-నబీ సందేశమైన ప్రేమ, సేవ, సోదరభావం, మానవతా విలువలను ప్రజల్లో మరింతగా పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.



