–స్థానిక వ్యాపారుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి–సీపీఎం
సలాం ప్రొద్దుటూరు:
కార్పొరేట్ సంస్థల విస్తరణతో ప్రొద్దుటూరులో చిన్న, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీ-మార్ట్, రిలయన్స్ వంటి భారీ సూపర్ మార్కెట్ల కారణంగా స్థానిక చిల్లర వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.వైఎంఆర్ కాలనీలోని సుమారు 150 చిన్నచిన్న చిల్లర దుకాణాలు పెద్ద సంస్థల పోటీ కారణంగా వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. స్థానికంగా ఉపాధి కల్పిస్తున్న చిన్న వ్యాపారాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చైతన్య, నారాయణ, భాష్యం వంటి పెద్ద విద్యాసంస్థల విస్తరణతో చిన్న ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సత్యనారాయణ అన్నారు. గతంలో నారాయణ విద్యాసంస్థల ఏర్పాటును సీపీఎం వ్యతిరేకించిందని, ఆ సమయంలో పార్టీ నాయకులపై కేసులు కూడా నమోదయ్యాయని గుర్తుచేశారు.అదేవిధంగా సీఎంఆర్ వంటి పెద్ద వస్త్ర దుకాణాలు రావడంతో స్థానిక వస్త్ర వ్యాపారులు నష్టపోతున్నారని, కల్యాణి జ్యువెలర్స్ వంటి కార్పొరేట్ సంస్థల రాకతో స్థానిక బంగారు వ్యాపారులు, స్వర్ణకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.పండుగల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపార సంస్థలు స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. చిన్న, చిరు వ్యాపారుల ప్రయోజనాల కోసం సీపీఎం నిరంతరం పోరాడుతుందని సత్యనారాయణ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యుడు జి. పకీరయ్య, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి బి. విశ్వనాథ్ పాల్గొన్నారు.
