
సలాం ప్రొద్దుటూరు:
శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించిన అనంతరం వరలక్ష్మీదేవిని గజవాహనంపై విశేషంగా అలంకరించారు.వరలక్ష్మీ వ్రతం కోసం ఆలయానికి తరలివచ్చిన ముత్తైదువులు కలశాలను ధరించి ఆలయ తిరుమాడ వీధుల్లో ప్రదక్షిణ చేశారు. అనంతరం 140 మంది ముత్తైదువులతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. భక్తులు వరలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు భక్తులకు అమ్మవారి ప్రసాదం, గాజులు, శేషవస్త్రం, పసుపు–కుంకుమ, పండ్ల సాంగేములు అందజేశారు. అనంతరం భక్తుల కోసం ఘనంగా అన్నప్రసాద వితరణ నిర్వహించారు.ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, కార్యక్రమాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. రమణ, చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

