ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రత్యక్ష 'పుర'పోరు!....నేరుగా చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక..! రేపు అసెంబ్లీ లో బిల్లు

ప్రత్యక్ష ‘పుర’పోరు!….నేరుగా చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక..! రేపు అసెంబ్లీ లో బిల్లు

📰 Generate e-Paper Clip

 

–అక్టోబరు 1న మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌?

 

–100 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన షెడ్యూల్‌ జారీ…

 

–మిగిలిన 23 సంస్థల్లో పెండింగ్‌…నాలుగు చోట్ల సమస్యలకు పరిష్కారం

 

–సెప్టెంబరు 25-26ల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ,….మహిళలకు కేటాయించే వార్డుల నిర్ధారణ

 

–అప్పుడే మేయర్లు, చైర్‌పర్సన్ల కోటా ప్రక్రియ…27-30 మధ్య రిజర్వేషన్‌ ఖరారు, గెజిట్‌

 

–మొత్తం ప్రక్రియకు 45 రోజులు….ఇప్పటికే ప్రారంభమైన ఓటర్ల జాబితా కసరత్తు

 

సలాం ప్రొద్దుటూరు –  అమరావతి:

 

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలను ప్రత్యక్ష విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లను ప్రజలు నేరుగా ఎన్నుకునేందుకు వీలుగా మంగళవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముసాయిదాను రూపొందించింది. 1986 నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటూ వచ్చారు. 2005లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యక్ష ఎన్నికలకు స్వస్తి పలికారు. ప్రజలు ఎన్నుకునే కౌన్సిలర్లు/కార్పొరేటర్లే తమలో ఒకరిని చైర్‌పర్సన్‌/మేయర్‌గా ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పద్ధతి కారణంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలనాపరంగా, అభివృద్ధిపరంగా అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణకు బిల్లు రూపొందించింది. అక్టోబరు 1న ఎన్నికల షెడ్యూల్‌ జారీకి మున్సిపల్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతకుముందే సెప్టెంబరు 25-26 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయించాల్సిన వార్డులను నిర్ధారిస్తారు. మేయర్లు, చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల ప్రక్రియను కూడా సమాంతరంగా చేపడతారు. సెప్టెంబరు 27-30 మధ్య కలెక్టర్ల ద్వారా రిజర్వేషన్‌ కేటాయింపు, గెజిట్‌ ప్రచురణ పూర్తి చేయాలని ప్రతిపాదించారు. షెడ్యూల్‌ జారీ నుంచి ఎన్నికల ఫలితాల వరకు మొత్తం ప్రక్రియకు 45 రోజులు పడుతుందని అంచనా.

 

*న్యాయపరమైన చిక్కులు..*

 

123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి న్యాయపరమైన అంశాలు, వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే 100 పట్టణ స్థానిక సంస్థల్లో పునర్విభజన షెడ్యూల్‌ జారీ చేశారు. మిగిలిన 23 సంస్థల్లో న్యాయపరమైన అంశాల కారణంగా ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. వీటిలో విలీనాలకు సంబంధించిన యాక్ట్‌-5 పరిధిలోని 4 కేసులు.. మంగళగిరి-తాడేపల్లి, కావలి, శ్రీకాళహస్తి, అల్లూరు సమస్యలు పరిష్కారమయ్యాయి. తాడిగడప, చింతలపూడిలో కేసులు దాఖలు కాకపోయినా అవి యాక్ట్‌-5 పరిధిలో ఉండడంతో ముందుకు కదల్లేదు. కాకినాడలో గ్రామాల విలీనం, ఆమదాలవలసలో డీలిమిటేషన్‌ అభ్యంతరాలు, నరసరావుపేట మున్సిపాలిటీలో ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు సహా మిగతా 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక వార్డుల పునర్విభజనకు సంబంధించిన 68 ప్రతిపాదనలు ఉత్తర్వుల జారీకి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు అందిన వెంటనే గెజిట్‌లో ప్రచురిస్తారు. మరో 17 ప్రతిపాదనల ఆమోద ప్రక్రియను వారంలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కోర్టు అడ్డంకులు తొలగిన ప్రాంతాల్లో పునర్విభజనను మూడు వారాల్లో పూర్తి చేసే అవకాశముంది. కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాత.. డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తయిన 21 రోజుల అనంతరం ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికల కోసం వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబరు 3న ఓటర్ల జాబితాను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ప్రకటించాలని ఆదేశించింది. అదే సమయంలో పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, వాటికి సంబంధించిన నోటిఫికేషన్‌, ఎన్నికల సామగ్రి కొనుగోలు వంటి పనులను సమాంతరంగా చేపడతారు.

 

*ఎన్నికలకు రూ.104.15 కోట్ల బడ్జెట్‌!…*

 

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు మొత్తం రూ.104.15 కోట్ల బడ్జెట్‌ కోసం మున్సిపల్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. పోలింగ్‌ సిబ్బందికి రూ.66.60 కోట్లు, కౌంటింగ్‌ సిబ్బందికి రూ.0.86 కోట్లు, ఓటర్ల జాబితాలు, స్టేషనరీ, పోస్టేజీ, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌, వాహనాలు, బారికేడ్లు, టెంట్లు, కుర్చీలకు రూ.18.30 కోట్లు.. అసిస్టెంట్‌ ఎన్నికల అధికారులకు రూ.0.56 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.1.10 కోట్లు, స్టేషనరీ కవర్లు, ఫారాల ముద్రణకు రూ.15.70 కోట్లు, చెరగని సిరాకు రూ.1.03 కోట్ల కోసం ప్రతిపాదించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!