–పారదర్శకంగా నియామకాలు జరిగాయి..
–ప్రతిభకే పెద్దపీట
సలాం ప్రొద్దుటూరు:
డీఎస్సీ నియామకాలను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించి, ప్రతిభ ఆధారంగానే అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించిందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు.శనివారం ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలు పొందిన తర్వాత కూడా నియామక ప్రక్రియపై విమర్శలు చేయడం సరికాదన్నారు. డీఎస్సీని నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించామని స్పష్టం చేశారు.ప్రతిభ ఉన్న అభ్యర్థులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుద్యోగ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చౌడం వెంకటకొండయ్య, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.
