
–డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నిరుద్యోగ భృతి తదితర డిమాండ్లపై ఆందోళన
సలాం ప్రొద్దుటూరు:
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతి కల్పించాలని తదితర డిమాండ్లతో ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ కొనసాగాయి. మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట నిర్వహిస్తున్న ఈ దీక్షలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.రెండో రోజు దీక్షలో రాజుపాలెం మండలానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, యువకులు, మహిళలతో పాటు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగానికి చెందిన పలువురు యువకులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
దీక్షకు నాయకుల సంఘీభావం
రెండో రోజు రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు మెట్టుపల్లె ప్రభాకర్ రెడ్డి, రాజుపాలెం మండల జడ్పీటీసీ అంజనీదేవి గోవర్ధన్ రెడ్డి, వెలవలి నారాయణ రెడ్డి, టంగుటూరు విశ్వనాథ్ రెడ్డి, కూలూరు సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, మెట్టుపల్లె యోగానంద రెడ్డి, గోనా వెంకట సుబ్బారెడ్డి, వాసుదేవపురం సర్పంచ్ ఉమామహేశ్వర రెడ్డి, కాచన వెంకట రామిరెడ్డి, నాగిరెడ్డి, మోహన్, శివ, బీటీ రెడ్డి, వెళ్లాల సత్యం తదితర ముఖ్య నాయకులు సంఘీభావం తెలిపారు.దీక్షలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు.
దీక్ష శిబిరాన్ని సందర్శించిన నేతలు
రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారిని కలిసి పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాతకోట ముని వంశీధర్ రెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, పిట్టా భద్రమ్మ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో పాల్గొంటున్న వారికి మద్దతు ప్రకటించారు.వారితో పాటు పలువురు మహిళా నాయకులు, వైఎస్సార్‌సీపీ యువ నాయకులు, నాయకులు, కార్యకర్తలు దీక్షా శిబిరానికి హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు.డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ, నిరుద్యోగ యువతకు భృతి తదితర డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ ఆందోళనకు పార్టీ శ్రేణులు మద్దతు ప్రకటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

