–44 వేల కిలోమీటర్ల పర్యావరణ సైకిల్ యాత్రకు ప్రొద్దుటూరులో ఘన సత్కారం
సలాం ప్రొద్దుటూరు:
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 11,11,111 మొక్కలు నాటాలనే మహత్తర సంకల్పంతో ఎనిమిది దేశాల్లో సుమారు 44 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన తమిళనాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ముత్తు సెల్వం ప్రొద్దుటూరుకు చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా పర్యావరణ మిత్ర, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నేషనల్ రికార్డు హోల్డర్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు గజ్జల వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ముత్తు సెల్వంను ఘనంగా సత్కరించారు. పర్యావరణ పరిరక్షణను భావితరాల భవిష్యత్తుకు అత్యంత అవసరమైన బాధ్యతగా భావిస్తూ ఇంతటి బృహత్తర యాత్ర చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ దేవతా వృక్షంగా భావించే ఉసిరి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటే మీ సంకల్పానికి సిరిపురి ప్రజల తరఫున సలాం తెలుపుతున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ముత్తు సెల్వం మాట్లాడుతూ, 2021 డిసెంబర్ 21న ఈ పర్యావరణ యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో యాత్ర పూర్తి చేసి ప్రస్తుతం భారతదేశంలో కొనసాగిస్తున్నామని చెప్పారు. అనంతరం మయన్మార్ (బర్మా), వియత్నాం, థాయ్లాండ్, భూటాన్ దేశాల్లో యాత్ర కొనసాగించి మొత్తం 44 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 11,11,111 మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. 2028లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈ పర్యావరణ యాత్రను ముగించాలని సంకల్పించానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మన ప్రజా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, సంఘసేవ న్యూస్ ఛానల్ అధినేత డాక్టర్ మహమ్మద్ అయూబ్ ఖాన్, రోటరీ క్లబ్ ట్రెజరర్ దొంతు బాలాజీ, ట్రాఫిక్ కానిస్టేబుల్ బిల్లా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
