–ఫోన్ ద్వారానే ప్రజా సమస్యల స్వీకరణ..
–సత్వర పరిష్కారానికి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చర్య
సలాం ప్రొద్దుటూరు:
ప్రజలకు మున్సిపల్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రజలతో కమిషనర్ ముఖాముఖీ’ పేరుతో ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేకంగా ఫోన్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమాన్ని జూలై 27, 2026 నుంచి అమలు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు 9247563385, 9849905863 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చు. అనంతరం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమం కొనసాగుతుంది.
ఈ కార్యక్రమం ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, అనారోగ్యంతో కార్యాలయానికి రాలేని వారు, పట్టణానికి దూరంగా నివసిస్తున్న ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఫోన్ ద్వారా నమోదైన ప్రతి ఫిర్యాదును అదే రోజు సంబంధిత శాఖలకు పంపించి, నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, మెప్మా, PGRS విభాగాల అధికారులు పాల్గొని ప్రజా సమస్యలను నేరుగా సమీక్షిస్తారు. ప్రతి సోమవారం నమోదైన ఫిర్యాదులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కమిషనర్ స్వయంగా పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
ఫిర్యాదు నమోదు చేసే సమయంలో ఫిర్యాదుదారులు తమ పేరు, పూర్తి చిరునామా, మొబైల్ నంబర్, సమస్య వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పరిష్కరించగల సమస్యలను మాత్రమే ఈ కార్యక్రమంలో స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర స్పందన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
