–బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు
సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):
నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హరిబాబు తెలిపారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులు, యువత, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014 నుంచి దేశవ్యాప్తంగా 152 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, నీట్ పేపర్ లీకేజీ కారణంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని హరిబాబు ఖండించారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని, నీట్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నీట్‌తో పాటు ఇతర పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, ఈ నెల 24న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు సప్తగిరి, చరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
