ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం..!

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం..!

📰 Generate e-Paper Clip

 

 

–రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

 

–హౌసింగ్ పథకంలో అక్రమాలపై విచారణ

 

–ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో కలిసి.. బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ పరిశీలన, లబ్దిదారులతో ముఖాముఖి

 

 

సలాం ప్రొద్దుటూరు:

పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ పథకం అమలులో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులందరికీ న్యాయం చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

శనివారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని బొల్లవరం హౌసింగ్ లేఅవుట్‌ను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో కలిసి సందర్శించిన మంత్రి అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “పేదలకు సొంత ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు కాదు.. వారి జీవితానికి భద్రత, గౌరవం అన్నారు. ప్రొద్దుటూరులో ఒక్క అర్హుడూ ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే మా సంకల్పం” అన్నారు.

గతంలో హౌసింగ్ పథకం అమలులో అనేక అవకతవకలు జరిగాయని, లబ్ధిదారుల ఎంపిక, ప్లాట్ల కేటాయింపు, గృహ నిర్మాణాల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా మెప్మా మహిళా సంఘాలకు సంబంధించిన నిధుల వినియోగంలో సుమారు రూ.48 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పేదల కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

పేదల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సరైన లబ్ధిదారునికే చేరాలి. గతంలో ఎక్కడైనా అన్యాయం జరిగి ఉంటే దాన్ని సరిదిద్దడం మా బాధ్యత. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం” అని మంత్రి పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో హౌసింగ్ కార్యక్రమం పురోగతిని వివరిస్తూ, రామేశ్వరం, బొల్లవరం, మీనాపురం లేఅవుట్లలో మొత్తం 4,82,481 సెంట్ల విస్తీర్ణంలో 23,068 ప్లాట్లు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే 19,924 ప్లాట్లు లబ్ధిదారులకు కేటాయించగా, మిగిలిన 3,144 ప్లాట్లను కూడా త్వరలో అర్హులైన పేదలకు అందజేస్తామని చెప్పారు.

అలాగే నియోజకవర్గంలో ఇప్పటివరకు 15,043 ఇళ్లకు అనుమతులు మంజూరు చేశామని, అందులో పట్టణ ప్రాంతాల్లో 11,655 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3,388 ఇళ్లు ఉన్నాయని వెల్లడించారు. రామేశ్వరం లేఅవుట్‌లో 7,647 ప్లాట్లలో 6,712, బొల్లవరం లేఅవుట్‌లో 10,462 ప్లాట్లలో 9,373, మీనాపురం లేఅవుట్‌లో 4,959 ప్లాట్లలో 3,839 ప్లాట్లు ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించినట్లు తెలిపారు.

బొల్లవరం లేఅవుట్‌లో గృహ నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లను అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్న మంత్రి, ఇప్పటివరకు సుమారు 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో 4 లక్షల ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారుల చేతికి తాళాలు అందజేస్తామని వెల్లడించారు.

ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించేందుకు సొంత ఇల్లు అత్యంత అవసరం. పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం. ఇంటి స్థలం నుంచి గృహ నిర్మాణం వరకు అన్ని దశల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని గృహరహిత కుటుంబాలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ… ప్రొద్దుటూరులో ఒక్క అర్హుడూ ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే మా సంకల్పం” అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో హౌసింగ్ లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి మంత్రి పార్థసారథి ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని అన్నారు.

 

గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ పథకం అమలులో అనేక లోపాలు, అక్రమాలు చోటుచేసుకోవడంతో వేలాది మంది పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించకపోవడం, నిర్మాణాలు మధ్యలో నిలిచిపోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని చెప్పారు.

 

బొల్లవరం హౌసింగ్ లేఅవుట్‌లో అనేక ఇళ్లు అసంపూర్తిగా ఉండటంతో లబ్ధిదారులు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన గృహ నిర్మాణాలను తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించిందన్నారు. నిర్మాణాలు పూర్తిచేసే లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రామేశ్వరం, బొల్లవరం, మీనాపురం లేఅవుట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

 

హౌసింగ్ పథకానికి సంబంధించిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మెప్మా మహిళా సంఘాల నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, విచారణలో వాస్తవాలు బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష, హౌసింగ్ సీఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడి రాజారత్నం, తహశీల్దార్ ఉదయ భాస్కర్, హౌసింగ్ డీఈలు సంబందిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!