ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్చట్టాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించం

చట్టాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించం

📰 Generate e-Paper Clip

–రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి

–విద్యాసంస్థలు, హాస్టళ్లలో పిల్లల రక్షణపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వర్క్ షాప్

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల చట్టాల అమలులో అలసత్వం వహిస్తే సహించబోమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో.. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యా హక్కు అమలు, బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల నియంత్రణ, పాఠశాలలు-హాస్టళ్లలో భద్రతా ప్రమాణాల అమలుపై జిల్లా స్థాయి వర్క్‌షాప్ మరియు సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారిత శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ధోని శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని… విద్యా హక్కు చట్టం (ఆర్.టీ.ఈ-2009), బాల్య వివాహాల నిరోధక చట్టం (పీసీఎంఏ -2006), పోక్సో చట్టం (పోక్సో-2012), జువెనైల్ జస్టిస్ చట్టం (జేజే యాక్ట్-2015) అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబందిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, పోక్సో చట్టం అమలు, పాఠశాల మానివేత పిల్లల పునఃప్రవేశం, బాలల పోషకాహారం, ఆరోగ్యం, బాలల సంరక్షణ సంస్థల పనితీరు, బాలల న్యాయ వ్యవస్థ అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. పిల్లల ఆరోగ్యం, విద్య, రక్షణ వంటి మౌలిక హక్కులను సమర్థవంతంగా అందించడంలో ప్రభుత్వ శాఖలతో పాటు స్థానిక సంస్థల పాత్ర కూడా ఎంతో కీలకమని అన్నారు. ఒక జిల్లాలో పిల్లలు సురక్షితంగా, సంతోషంగా జీవిస్తే అదే ఆ జిల్లా అభివృద్ధికి ప్రధాన సూచికగా నిలుస్తుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక సమస్యలను పూర్తిగా నిర్మూలించేందుకు గ్రామ, మండల, పట్టణ స్థాయిలో సమష్టి కృషి అవసరమని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం.46 ప్రకారం జిల్లా స్థాయి అధికారులు ప్రతి నెల రెండు రోజులు ప్రభుత్వ హాస్టళ్లలో బస చేసి అక్కడి సౌకర్యాలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేపట్టాలని, ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల హాస్టళ్లలో సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. బాలల రక్షణ విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని స్పష్టం చేశారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చినా వాటి అమలులో ఇంకా లోపాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనం అందించడం.. మొత్తం సమాజానిదే బాధ్యత అని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం (ఆర్.టీ.ఈ-2009) ప్రకారం పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య అందేలా ప్రతి విద్యాసంస్థ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం అమలులో గ్రామస్థాయి నుంచి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక దురాచారమని పేర్కొన్నారు. అనుమానాస్పద ఘటనలపై వెంటనే స్పందించి నివారించాల్సిన బాధ్యత ప్రతి శాఖపై ఉందన్నారు. పోక్సో చట్టం (పోక్సో-2012) కింద నమోదయ్యే కేసుల్లో బాధిత చిన్నారులకు న్యాయం త్వరగా అందేలా అధికారులు, పోలీసులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు సమర్థంగా పనిచేయాలని, విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ వంటి అంశాలపై నిరంతర అవగాహన కల్పించాలని తెలిపారు. ఇటీవలి కాలంలో పిల్లల్లో మాదకద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే కౌన్సెలింగ్ అందించాలని, పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టళ్లలో విద్యార్థుల భద్రత అత్యంత కీలకమని, సీసీ కెమెరాలు, సందర్శకుల నమోదు వ్యవస్థ, భద్రతా సిబ్బంది, ఆరోగ్య పరీక్షలు, ఆహార నాణ్యత వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బాలలపై వేధింపులు, వివక్ష, నిర్లక్ష్యం వంటి ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని ప్రతి శాఖ బాలల సంక్షేమాన్ని ప్రధాన బాధ్యతగా భావించి పనిచేస్తేనే సురక్షితమైన, బాలల అనుకూల సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు సురక్షితమైన, అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, హాస్టల్ నిర్వాహకులు, తల్లిదండ్రులు మరియు సంబంధిత శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. బాలల సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత శాఖ జిల్లా అధికారి ఈ. రమాదేవి మాట్లాడుతూ బాలికలకు అందిస్తున్న పౌష్టికాహారం, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వహణ, పిల్లల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి.ఆర్. సుభాష్ యాదవ్ వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, సేవలు మరియు అందుబాటులో ఉన్న వనరులపై సమగ్ర అవగాహన కల్పించారు. కార్మిక శాఖ అధికారులు మాట్లాడుతూ బాల కార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని, ప్రతి బుధవారం అంతరశాఖల సమన్వయంతో తనిఖీలు చేపట్టి గుర్తించిన పిల్లలకు అవసరమైన పునరావాస, విద్యా సేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలల్లో బాలల రక్షణ, మానసిక-శారీరక వికాసం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించగా, అదనపు ఎస్పీ పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు నమోదయ్యే కేసుల్లో తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సమావేశంలో బాలల సంక్షేమం, భద్రత, విద్యా హక్కుల అమలు, పాఠశాలలు, హాస్టళ్లలో భద్రతా ప్రమాణాలు, మాదకద్రవ్యాల నివారణ చర్యలపై వివిధ శాఖల అధికారులు సమీక్ష నిర్వహించి, కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడి రమాదేవి, డీఈవో శంశుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపీసీ అనురాధ, వైవియూ సైకాలజీ విభాగాధిపతి లు, డిసీపీవో విద్యాశాఖ, పోలీసు శాఖ, సామాజిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, హాస్టల్ సంక్షేమ అధికారులు, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు, బాలల న్యాయమండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు, పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!