సలాం ప్రొద్దుటూరు (కల్చరల్):
హరినామ సంకీర్తన లతో, భక్తుల ఆధ్యాత్మిక నృత్యాలతో ప్రొద్దుటూరు పట్టణం భక్తి భావంలో మునిగిపోయింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీశ్రీ నితాయి గౌరసుందర్ మహా రథయాత్రను తొలిసారిగా పట్టణంలో ఘనంగా నిర్వహించారు. భక్తి, సేవ, ఆధ్యాత్మిక సందేశాలను ప్రజల్లో విస్తరించే లక్ష్యంతో ఈ మహా వేడుకను చేపట్టారు. ఇస్కాన్ పూర్వ ఆచార్యులలో ప్రముఖులైన శ్రీల భక్తివినోద్ ఠాకూర్ తిరోభావ తిథి సందర్భంగా, అలాగే ఇస్కాన్ స్థాపనకు 60 సంవత్సరాలు పూర్తయిన డైమండ్ జూబిలీ ఉత్సవాల నేపథ్యంలో ఈ రథయాత్ర నిర్వహించారు. మైదుకూరు రోడ్డులోని వస్రభారతి కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన రథయాత్ర శివాలయం సర్కిల్ మీదుగా ఇస్కాన్ మందిరం వరకు కొనసాగింది. మార్గమంతా భక్తులు హరినామ సంకీర్తనలు ఆలపిస్తూ, కీర్తనలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
మందిరంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ భగవద్గీత ప్రచారకులైన శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరై భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. భక్తి మార్గం, భగవద్గీత బోధనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మహాప్రసాద వితరణ నిర్వహించారు. ప్రొద్దుటూరు చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ మహా రథయాత్ర పట్టణ ప్రజలకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
