సలాం ప్రొద్దుటూరు (పులివెందుల ):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించనున్నారు. కడప జిల్లా పులివెందులలో 1949 జూలై 8న జన్మించిన వైఎస్సార్ వైద్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ఎదిగారు.
2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2003లో చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది.
2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మృతి చెందినప్పటికీ, ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
