

–పశుసంపద సంరక్షణ, పశుగ్రాస నిల్వలు, నీటి పొదుపుపై పశువైద్య నిపుణుల సూచనలు
సలాం ప్రొద్దుటూరు – కొర్రపాడు:
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పశుసంపదను సంరక్షించుకోవడం, పశుగ్రాసాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, నీటిని పొదుపుగా వినియోగించడం, పశువుల్లో వేడి ఒత్తిడిని నివారించడంపై రైతులకు అవగాహన కల్పించేందుకు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో కొర్రపాడు గ్రామంలో అవగాహన ర్యాలీ, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డా. జి.ఆర్.కె. శర్మ ముఖ్య అతిథిగా హాజరై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం రైతులకు ఎల్నినో పరిస్థితుల్లో పశువుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు.ఈ సందర్భంగా పశువులకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, తగినంత నీడ కల్పించడంతోపాటు గాలి ప్రసరణకు అనువైన వాతావరణం ఏర్పాటు చేయాలని నిపుణులు సూచించారు. ఎండుగడ్డి, సైలేజ్ వంటి పశుగ్రాసాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని, సమతుల్య పోషకాహారం అందించాలని తెలిపారు. నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.పశువుల్లో అధిక వేడి కారణంగా కనిపించే లక్షణాలను గుర్తించి, అవసరమైనప్పుడు వెంటనే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎల్నినో ప్రభావాలను తగ్గించి పశుసంపద ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎల్పీఎం విభాగానికి చెందిన డా. డి. ఇందిర, అసోసియేట్ ప్రొఫెసర్ డా. వి. జ్ఞాని చరిత, డా. ఎన్. సుభాషిణి, డా. టి. నాగ సాయి ఉర్మిళ, డా. పి. గాయత్రి, ఎంవీఎస్సీ విద్యార్థులు డా. జి. జాన్ సుధాకర్ బాబు, డా. కె. వంశీ, డా. కె. మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వాలంటీర్లు కూడా కార్యక్రమంలో భాగస్వాములై రైతులకు అవగాహన కల్పించారు.ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ పశుసంపద ఆరోగ్యాన్ని, పశుగ్రాస లభ్యతను కాపాడుకోవాలని పశువైద్య నిపుణులు పిలుపునిచ్చారు.

