ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ల దొంగల ముఠా గుట్టురట్టు

విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ల దొంగల ముఠా గుట్టురట్టు

📰 Generate e-Paper Clip

–ఐదుగురు నిందితుల అరెస్ట్.. చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలుడు అదుపులో

–రూ.5.40 లక్షల నగదు, 56 కిలోల సర్వీస్ వైర్, 5 కిలోల కాపర్ వైర్ స్వాధీనం

–ప్రొద్దుటూరు–రాజుపాలెం పరిధిలో ఏడాది కాలంగా చోరీలు.. నాలుగు కేసులకు కీలక ఆధారాలు

–వివరాలు వెల్లడించిన ASP యు. విభవ్ కృష్ణ

సలాం ప్రొద్దుటూరు :

విద్యుత్ సర్వీస్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్లను లక్ష్యంగా చేసుకుని రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు, చట్టంతో సంఘర్షణలో ఉన్న ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.5.40 లక్షల నగదు, 56 కిలోల అల్యూమినియం సర్వీస్ వైర్, 5 కిలోల కాపర్ వైర్తో పాటు చోరీలకు ఉపయోగించిన వాహనాలు, ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.బుధవారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ASP విభూ కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారంతో ముఠా పట్టివేత

ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోములవారిపల్లె జగనన్న కాలనీలో అల్యూమినియం విద్యుత్ వైర్, ట్రాన్స్‌ఫార్మర్ వైర్ల చోరీపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 23న పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.దీంతో రూరల్ CI నాగభూషణ్ ఆధ్వర్యంలో SI కె.సి. రాజు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు వారు సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన కొందరు వాహనాలను వదిలి పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.వారిలో ఐదుగురు నిందితులు కాగా, ఒకరు చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలుడుగా గుర్తించారు. ముఠాతో ఉన్న ఆటో డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు.

ఏడాది కాలంగా రాత్రివేళల్లో చోరీలు

పోలీసుల విచారణలో నిందితులు సుమారు సంవత్సరం కాలంగా ముఠాగా ఏర్పడి ప్రొద్దుటూరు, రామేశ్వరం జగనన్న కాలనీతో పాటు రాజుపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది.రాత్రివేళల్లో విద్యుత్ సర్వీస్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసేవారని పోలీసులు తెలిపారు. అనంతరం చోరీ చేసిన వైర్లు, కాపర్‌ను గుజరి వ్యాపారులకు విక్రయించి, వచ్చిన నగదును తమలో తాము పంచుకుని వినియోగించినట్లు విచారణలో వెల్లడైనట్లు ASP తెలిపారు.

నాలుగు కేసులకు కీలక ఆధారాలు

నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంబంధిత ప్రాంతాల్లో స్పాట్ వెరిఫికేషన్, కేసుల వారీగా ఆధారాల పరిశీలన, చోరీ సొత్తు గుర్తింపు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు ట్రాన్స్‌ఫార్మర్ వైర్ల చోరీ కేసులు, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో రెండు కేసులకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

రూ.5.40 లక్షల నగదు.. భారీగా చోరీ సొత్తు

నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ₹5,40,000 నగదు,56 కిలోల అల్యూమినియం సర్వీస్ వైర్,5 కిలోల కాపర్ వైర్,బజాజ్ ఆటో,బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్,TVS యాక్టివా స్కూటీ,ఇనుప యాక్స్ బ్లేడ్ సెట్లు,ఒక ఇనుప గొడ్డలి,ఒక సుత్తి,ఒక నిచ్చెన తదితర సామగ్రి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల వివరాలు

పోలీసుల ప్రకారం అరెస్టయిన నిందితుల్లో పోలిశెట్టి వెంకటేశ్వర్లు (37), మద్దికం కృష్ణయ్య (41), ముక్కుమల మహేష్ (38), మాలిక సాయి కిరణ్ (26), పొలంక రంగనాయకులు (25) ఉన్నారు. మరో 15 ఏళ్ల బాలుడిని చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలుడిగా పోలీసులు గుర్తించారు.

పరారీలో ఆటోడ్రైవర్.. కొనసాగుతున్న దర్యాప్తు

ముఠాతో ఉన్న ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు కొనసాగుతోంది. అలాగే అరెస్టయిన నిందితులు గతంలో మరిన్ని విద్యుత్ వైర్ల చోరీలకు పాల్పడ్డారా? ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులతో వారికి సంబంధం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసు బృందానికి ASP అభినందనలు

కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన రూరల్ CI నాగభూషణ్, SI కె.సి. రాజుతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మరియు ప్రత్యేక బృందం సిబ్బందిని ASP విభూ కృష్ణ అభినందించారు.విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, సర్వీస్ వైర్లు, కేబుళ్లను లక్ష్యంగా చేసుకుని జరిగే చోరీలపై నిఘా మరింత పెంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!