–ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యంపై సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో ధర్నా
సలాం ప్రొద్దుటూరు:
పండుగల సందర్భంగా ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ప్రొద్దుటూరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మన్ మాట్లాడుతూ.. హైదరాబాద్, చెన్నై, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు పండుగల సమయంలో స్వగ్రామాలకు వచ్చి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారని తెలిపారు. అయితే పండుగల సీజన్‌ను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు చార్జీలను భారీగా పెంచడంతో సామాన్య ప్రజలు స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆన్‌లైన్‌లోనే భారీ చార్జీలు బహిరంగంగా వసూలు చేస్తున్నప్పటికీ సంబంధిత ఆర్టీఏ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. ప్రైవేట్ ఆపరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధిక చార్జీల దోపిడీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు.రాబోయే వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు మరోసారి భారీగా చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి పండుగల సమయంలో అధిక చార్జీల వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే బస్సు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు కోరారు.ఈ ధర్నాలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు ఎం.చంటి, కమిటీ సభ్యులు శాంతి, నీతమ్మ, కార్తీక్, చిన్న సామయ్య, ఐద్వా కార్యదర్శి జి.ప్రేమ, అధ్యక్షురాలు వై.విజయమ్మ, ఉపాధ్యక్షురాలు యు.వెంకటసుబ్బమ్మ, ఎం.లక్ష్మీదేవి, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి బి.విశ్వనాథ్, అధ్యక్షుడు మేరీ బాబు తదితరులు పాల్గొన్నారు.
