–పట్టాలిచ్చి 15 ఏళ్లు.. మౌలిక వసతులు మాత్రం కరువు
–విద్యుత్, తాగునీరు, రోడ్లు, హౌసింగ్ రుణాలు కల్పించాలి
సలాం ప్రొద్దుటూరు కడప:
కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని అమృత్‌నగర్‌లో 2008, 2018 సంవత్సరాల్లో పట్టాలు పొంది స్థలాలు పొందిన సుమారు 2,200 మంది లబ్ధిదారులకు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం ప్రొద్దుటూరు కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపల్ వార్డులు, రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు 2008, 2018లో అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చి స్థలాలు కేటాయించిందన్నారు. పలువురు లబ్ధిదారులు సొంత డబ్బులతో లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారని, కొందరు స్లాబ్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తి చేశారని తెలిపారు.అయితే అమృత్‌నగర్‌లో ఇప్పటికీ విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో పాటు హౌసింగ్ రుణాలు కూడా లబ్ధిదారులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత స్థలాలు ఉన్నప్పటికీ పేదలు అద్దె ఇళ్లలోనే నివసిస్తూ ప్రతి నెల వేలాది రూపాయలు అద్దెలుగా చెల్లించాల్సి వస్తోందన్నారు.గత 15 సంవత్సరాలుగా సమస్య పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని సత్యనారాయణ తెలిపారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముద్దనూరుకు వచ్చిన సమయంలో, అలాగే ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో స్వయంగా కలిసి వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.ఇకనైనా కలెక్టర్ స్వయంగా చొరవ తీసుకుని సమస్యను కింది స్థాయి అధికారులకు పంపడంతో సరిపెట్టకుండా, అమృత్‌నగర్ లబ్ధిదారులకు విద్యుత్, తాగునీరు, రోడ్లు, హౌసింగ్ రుణాలు తదితర మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ధర్నాలో చేనేత జిల్లా అధ్యక్షుడు ఓబులేష్, ఐద్వా ప్రొద్దుటూరు కార్యదర్శి జి.ప్రేమ, అధ్యక్షురాలు వై.విజయమ్మ, వెంకటసుబ్బమ్మ, సీపీఎం పట్టణ కమిటీ సభ్యురాలు కె.సర్వేశ్వరి, ఐజే సుదర్శనమ్మ, గోవిందమ్మ, అంజమ్మ, నాగేశ్వరరావు, సీఐటీయూ కార్యదర్శి బి.విజయకుమార్, సురేష్, భైరవ, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో అమృత్‌నగర్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
