–సోమలవారిపల్లితో ముగిసిన ఐదు గ్రామపంచాయతీల గ్రామసభలు
–అనుకూల–వ్యతిరేక అభిప్రాయాలను నమోదు చేసిన అధికారులు..
–డీపీఓకు సమగ్ర నివేదిక పంపనున్నట్లు ప్రత్యేక అధికారి మంజుల వాణి వెల్లడి
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఐదు గ్రామపంచాయతీల విలీన ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాల సేకరణ ప్రక్రియ పూర్తయింది. చివరిదైన సోమలవారిపల్లి గ్రామంలో గురువారం ప్రశాంత వాతావరణంలో గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలను సేకరించినట్లు ప్రత్యేక అధికారి మంజుల వాణి తెలిపారు. గ్రామసభ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఐదు గ్రామాల్లో గ్రామసభలు పూర్తి
చౌటపల్లి, దొరసానిపల్లి, సోమలవారిపల్లి, కొత్తపల్లి, గోపవరం గ్రామపంచాయతీలను ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతిపాదనపై జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఆదేశాల మేరకు గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో గ్రామసభలు పూర్తికాగా, సోమలవారిపల్లిలో నిర్వహించిన సమావేశంతో ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు.
విలీనం వల్ల లాభనష్టాలపై అవగాహన
గ్రామసభలో మున్సిపాలిటీలో విలీనమైతే కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, అలాగే గ్రామపంచాయతీగా కొనసాగితే ఉండే లాభనష్టాలను అధికారులు ప్రజలకు వివరించారు. గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.
రెండు రిజిస్టర్లలో సంతకాల నమోదు
విలీనానికి అనుకూలంగా ఉన్నవారి కోసం ఒక రిజిస్టర్, వ్యతిరేకంగా ఉన్నవారి కోసం మరో రిజిస్టర్ ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను సంతకాల రూపంలో నమోదు చేశారు. ఈ అభిప్రాయాలతో పాటు సర్వే వివరాలు, మ్యాపులు, ఇతర రికార్డులను జత చేసి జిల్లా పంచాయతీ అధికారికి సమగ్ర నివేదిక పంపనున్నట్లు ప్రత్యేక అధికారి మంజుల వాణి తెలిపారు.
ప్రశాంతంగా ముగిసిన గ్రామసభ
గ్రామసభ ప్రశాంతంగా నిర్వహించడంలో డీఎల్పీఓ నూర్జహాన్, డిప్యూటీ ఎంపీడీవో రామాంజనేయరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరసింహులు, గ్రామ సచివాలయ సిబ్బంది, పోలీసు అధికారులు సహకరించినట్లు తెలిపారు. అలాగే సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించిన గ్రామ ప్రజలు, మీడియా ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
