–కొత్తపల్లి పంచాయతీ విలీనంపై ముగిసిన ప్రజాభిప్రాయం
–భారీగా పాల్గొన్న గ్రామస్తులు.. తుది నిర్ణయంపై అందరి దృష్టి
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కొత్తపల్లిని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతిపాదనపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ ప్రక్రియలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
అధికారుల ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ కొనసాగగా, సుమారు 1,100 మంది గ్రామస్తులు తమ అభిప్రాయాన్ని నమోదు చేసినట్లు సమాచారం. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ వివరాలను డి పి ఓ కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. నివేదిక, ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా కొత్తపల్లి పంచాయతీగా కొనసాగాలా లేదా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేయాలా అనే అంశంపై తుది నిర్ణయం వెలువడనుంది.
విలీన అంశంపై గ్రామంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే దివంగత రమణారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి విలీనాన్ని వ్యతిరేకించగా, టీడీపీ సీనియర్ నాయకుడు సినీహాబ్, ఎస్ఆర్ఐటీ విద్యాసంస్థల అధినేత బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి విలీనానికి మద్దతు ప్రకటించారు. విలీనం ద్వారా గ్రామానికి మెరుగైన మౌలిక వసతులు, పట్టణ స్థాయి అభివృద్ధి అవకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు.
ఓటింగ్ అనంతరం గ్రామంలో మున్సిపాలిటీ విలీనానికి అనుకూలంగా మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ఫలితాలను సంబంధిత అధికారులు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికప్పుడు ఫలితాలు ప్రకటిస్తే గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ప్రజాభిప్రాయ సంతకాల రిజిస్టర్ లను డి పి ఓ కు పంపించారు. తుది ఫలితాలు, అనంతర ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
