సలాం ప్రొద్దుటూరు (కలికిరి):
అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ఎస్టీ కాలనీలో శనివారం ఏకలవ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసి ఎరుకల సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, భారతీయ చరిత్రలో ఏకలవ్య గురుభక్తి, త్యాగం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. గిరిజన సమాజానికి ఏకలవ్య జీవితం ఆదర్శప్రాయమని పేర్కొంటూ, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలనే స్ఫూర్తిని ఆయన జీవితం అందిస్తుందని చెప్పారు. గిరిజనుల విద్యాభివృద్ధి, సామాజిక పురోగతికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. యువత విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరిజన నాయకుడు జానం గంగిరెడ్డి మాట్లాడుతూ, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఏకలవ్య వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్య, ఉపాధి, సామాజిక సేవా రంగాల్లో యువత ముందుకు రావాలని సూచించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి అందరూ ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అనంతరం గిరిజన సంక్షేమం, విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యంపై పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఏకలవ్య ఆశయాలను స్మరిస్తూ గిరిజన సమాజ అభ్యున్నతికి ఐక్యంగా పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు బి. నాగయ్య, ఎస్. వెంకటరమణ, బండి రెడ్డప్ప, కే. నాగయ్య, శివకుమార్, క్రాంతి కుమార్, దాసరి శ్రీనివాసులు, జగన్నాథం గౌరీ, జీవశాస్త్ర ఉపాధ్యాయిని జానం సుజాత తదితరులు పాల్గొన్నారు.
