ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్శాంతియుతంగా.. పర్యావరణహితంగా వినాయక చవితి ఉత్సవాలు

శాంతియుతంగా.. పర్యావరణహితంగా వినాయక చవితి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

 

 

–పీస్ కమిటీ సమావేశంలో అధికారులకు, ఉత్సవ కమిటీలకు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచనలు

–సెప్టెంబర్ 12లోపు మండపాలకు అనుమతులు తప్పనిసరి.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు నో

–ప్రతి మండపం వద్ద ప్రత్యేక పర్యవేక్షణ.. లైవ్ శానిటేషన్‌తో పరిశుభ్ర ప్రొద్దుటూరుకు చర్యలు

 

సలాం   ప్రొద్దుటూరు:

వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలు, ఉత్సవ కమిటీలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.వినాయక చవితి సందర్భంగా శాంతిభద్రతలు, విద్యుత్ భద్రత, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించారు. ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు.

 

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు నో..

 

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించరాదని సమావేశంలో స్పష్టం చేశారు. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని సూచించారు.

 

సెప్టెంబర్ 12లోపు మండపాలకు అనుమతులు

 

ప్రొద్దుటూరు పట్టణంలో వినాయక విగ్రహాల మండపాల ఏర్పాటుకు 2026 సెప్టెంబర్ 12లోపు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఉత్సవ కమిటీలు, నిర్వాహకులకు సూచించారు. అనుమతులు లేకుండా మండపాలను ఏర్పాటు చేయకుండా నిర్వాహకులు అధికారులకు సహకరించాలని కోరారు.

 

ప్రతి మండపం వద్ద ప్రత్యేక పర్యవేక్షణ

 

ప్రతి వినాయక మండపాన్ని అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, శాంతిభద్రతలు, పారిశుధ్యం వంటి అంశాలను నిరంతరం పరిశీలించేలా చర్యలు చేపట్టనున్నారు.

 

మండపాల వద్ద లైవ్ శానిటేషన్

 

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని వినాయక మండపాల వద్ద లైవ్ శానిటేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. మండపాల పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, భక్తులు మరియు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.వినాయక చవితి ఉత్సవాలను సోదరభావంతో, సమన్వయంతో, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలు, ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు అధికారులకు పూర్తిగా సహకరించాలని పీస్ కమిటీ సభ్యులు కోరారు.ఈ సమావేశంలో ఎమ్మార్వో డి. ఉదయ్ భాస్కర్ రాజు, 1 టౌన్ సీఐ కొండారెడ్డి, 2 టౌన్ సీఐ వంశీధర్, 3 టౌన్ సీఐ రామాంజనేయుడు, ట్రాఫిక్ సీఐ భాస్కర్, ఆర్‌అండ్‌బీ డీఈ పి. లక్ష్మీ నరసింహులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ పి. బాసవి రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డా. పి. రూపానంద్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ చాంద్ బాషా, అంజుమన్ కమిటీ ప్రతినిధులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!