–మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
– తల్లిదండ్రులకు బాధ్యతాయుత సూచనలు
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణంలోని ఎద్దుల వెంకటసుబ్బమ్మ పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యాభివృద్ధిపై పలు సూచనలు చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ “నేటి పిల్లలే రేపటి పౌరులు” అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పిల్లల విద్యాభ్యాసంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, వారిని మంచి మార్గంలో నడిపిస్తూ విద్య పట్ల ఆసక్తి పెంపొందించాలని సూచించారు.ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా వరుసగా రెండో ఏడాది కూడా అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం జమ చేస్తున్నామని చెప్పారు. పేదరికం చదువుకు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు.అలాగే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి, ఎంఈవో సావిత్రమ్మ, ప్రధానోపాధ్యాయులు విజయ్ భాస్కర్, పాఠశాల తల్లిదండ్రుల సంఘం చైర్మన్ లక్ష్మీ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
