–చర్యలు తీసుకోకపోతే వైన్ షాపుల వద్ద ఉధృత ఉద్యమం ఐద్వా హెచ్చరిక
–ప్రొద్దుటూరులో వైన్ షాపు ఎదుట ధర్నా.. రాజీవ్ సర్కిల్ వరకు మహిళల ర్యాలీ
సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) ఆధ్వర్యంలో మంగళవారం ప్రొద్దుటూరులో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వైన్ షాపు ఎదుట ధర్నా చేపట్టిన మహిళలు అనంతరం రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ మాట్లాడుతూ, ఉదయం 5 గంటల నుంచే బార్లు, బ్రాందీ షాపులు తెరిచి మద్యం విక్రయాలు సాగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ అనుమతితోనే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మద్యం, గంజాయి, డ్రగ్స్‌కు యువత బానిసై చిన్న వయస్సులోనే తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఆదివారాల్లో మద్యం, డ్రగ్స్ మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయని, అనేక కుటుంబాలు దుర్ఘటనలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. మద్యం, డ్రగ్స్ వినియోగం వల్ల అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక చికిత్స అందించాలని, మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల బీమా పరిహారం మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే పాఠశాలలు, దేవాలయాలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల సమీపంలో మద్యం దుకాణాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం, గంజాయి విక్రయాలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటు వైన్ షాపుల ఎదుట ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా కడప జిల్లా అధ్యక్షురాలు ఐ.ఎన్. సుబ్బమ్మ, ప్రొద్దుటూరు పట్టణ కార్యదర్శి ప్రేమ, పట్టణ అధ్యక్షురాలు విజయకుమారి, కమిటీ సభ్యులు భానుమతి, వెంకటసుబ్బమ్మ, సర్వేశ్వరి, చెన్నమ్మ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్తలు గుర్రమ్మ, సన్నక్క, శాంతితో పాటు సుమారు 30 మంది మహిళలు ఆందోళనలో పాల్గొని మద్యం, గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
