సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ పాఠశాలలు పాఠ్యపుస్తకాల పేరుతో తల్లిదండ్రులపై వేల రూపాయల ఆర్థిక భారం మోపుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి హరిబాబు ఆరోపించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలనే తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థుల పుస్తకాలకే రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారని, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల ధరలు మరింత అధికంగా ఉన్నాయని తెలిపారు.పాఠ్యపుస్తకాలతో పాటు ట్యూషన్ ఫీజులు, వ్యాన్ ఛార్జీలు, హాస్టల్ ఫీజులు తదితర పేర్లతో ఒక్కో విద్యార్థి నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని, దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. మంచి విద్య పేరుతో తల్లిదండ్రులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు.అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ విద్యార్థులకు తగిన మౌలిక వసతులు కల్పించడంలో అనేక విద్యాసంస్థలు విఫలమవుతున్నాయని, విద్యార్థుల భద్రత విషయంలో తరచూ ఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు కొమ్ముకాస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాలు, అధిక ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరిబాబు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ నాయకులు దస్తగిరి, చరణ్, నరసింహ, దూద్‌పూర్ తదితరులు పాల్గొన్నారు.
