–ప్రొద్దుటూరు నియోజవర్గానికి ₹16 కోట్లతో అభివృద్ధి
–అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు…
–బ్రహ్మణి స్టీల్ నుంచి చెత్త పన్ను వరకు ప్రజలకు సమాధానం చెప్పాలి
–రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్
సలాం ప్రొద్దుటూరు:
స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అమలులో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు సాగుతోందని, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ₹16 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టామని త్వరలో ప్రొద్దుటూరు ను చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దామని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.
అత్యాధునిక వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం నిర్మిస్తున్నామని . రోజుకు 140 టన్నుల చెత్తను శుద్ధి చేసే సామర్థ్యంతో ఈ కేంద్రం నిర్మాణం చివరి దశకు చేరుకుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమాన్ని ప్రజల్లో విజయవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ట్రైసైకిళ్లు, కుంకార్ట్‌లు వంటి పారిశుద్ధ్య సదుపాయాల కోసం రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా డంప్‌యార్డ్‌లను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో 107 వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సుమారు 1.5 కోట్ల టన్నుల చెత్తను శాస్త్రీయంగా శుద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో పారిశుద్ధ్య మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
కొర్రపాడు రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను రెండు నెలల్లో పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. ఇప్పటికే బయో మైనింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో ప్రారంభం కానున్న ఆధునిక వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా మిగిలిన చెత్తను కూడా శాస్త్రీయంగా శుద్ధి చేస్తామని వెల్లడించారు.
రోజుకు 140 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో నిర్మిస్తున్న వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం
ఈ సందర్భంగా వైసీపీ నాయకుల విమర్శలకు ఘాటుగా స్పందించిన ఆయన 2019–24 మధ్య వైసీపీ ప్రభుత్వం “చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం” అని విమర్శించారు. ప్రజలు ఆ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న అవినీతి ఆరోపణలను ఖండించిన ఆయన, అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని వ్యాఖ్యానించారు. బ్రహ్మణి స్టీల్ ప్రాజెక్టు పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు అప్పగించడం, బ్యాంకు రుణాల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించి, ప్రజల ప్రయోజనాలను కాపాడింది ప్రస్తుత కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య రంగంలో శాశ్వత మార్పుల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
“వైసీపీ అవినీతిని ప్రజల ముందుంచుతాం..
వైసీపీ నాయకులు ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలకు ప్రజలే సమాధానం చెబుతారని, గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను పూర్తిస్థాయిలో ప్రజల ముందుకు తీసుకువస్తామని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ హెచ్చరించారు.
బ్రహ్మణి స్టీల్ వ్యవహారంలో వేల ఎకరాల భూమిని తక్కువ ధరకు అప్పగించి, దాని ఆధారంగా బ్యాంకుల నుంచి భారీ రుణాలు పొందారని ఆరోపించారు. అనంతరం ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజల ఆస్తిని కాపాడిందని పేర్కొన్నారు.
గత రెండేళ్లలో రాష్ట్రానికి రూ.4.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువత వలసలు తగ్గించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో గత ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.12 వేల కోట్ల మేర సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసిందని చెప్పారు. ప్రజలు ఇప్పటికే ఎన్నికల్లో వైసీపీకి తగిన తీర్పు ఇచ్చారని, ఆ తీర్పు నుంచి గుణపాఠం నేర్చుకుని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజలు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైసీపీ నాయకత్వం గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. అసెంబ్లీకి రావడానికి కూడా భయపడుతున్న నాయకులు సవాళ్లు విసరడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
