ePaper
Sunday, November 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రజల ప్రాణాలతో చెలగాటమా? అక్రమ ల్యాబ్‌లపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా!

ప్రజల ప్రాణాలతో చెలగాటమా? అక్రమ ల్యాబ్‌లపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా!

📰 Generate e-Paper Clip

 

–జిల్లాలో ప్రైవేట్ డయాగ్నస్టిక్, స్కానింగ్ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు

– నిబంధనలు ఉల్లంఘించిన కేంద్రాల సీజ్

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రజల ఆరోగ్య భద్రతతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అనధికారికంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, క్లినికల్ ల్యాబొరేటరీలపై అధికారులు కొరడా ఝళిపించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన కేంద్రాలను గుర్తించి సీజ్ చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా అధికారులు ఆయా కేంద్రాల్లో ప్రభుత్వ అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాంకేతిక సిబ్బంది అర్హతలు, వైద్య పరీక్షల పరికరాల నిర్వహణ, పరిశుభ్రత, పరీక్షల రికార్డులు, రోగులకు అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

అనుమతులు లేకుంటే అడ్డుకట్ట.. అక్రమాలకు పాల్పడితే చర్యలు!

 

ప్రభుత్వ అనుమతులు లేకుండా ల్యాబొరేటరీలు నిర్వహించడం, అర్హత లేని సిబ్బందితో వైద్య పరీక్షలు చేయించడం, నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సేవలు అందించడం, రోగులకు తప్పుడు పరీక్షా నివేదికలు ఇవ్వడం వంటి చర్యలను సహించబోమని డాక్టర్ యుగంధర్ హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించిన కేంద్రాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఉల్లంఘనల తీవ్రతను బట్టి సీజ్ చేయడం, రిజిస్ట్రేషన్ రద్దు చేయడం వంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు

 

ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు PCPNDT చట్టం–1994 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, లింగాన్ని వెల్లడించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకునే ముందు సంబంధిత కేంద్రానికి ప్రభుత్వ అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. జిల్లావ్యాప్తంగా అనధికారిక డయాగ్నస్టిక్ కేంద్రాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీత, డెమో భారతి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సీఓ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!