–ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు
సలాం ప్రొద్దుటూరు – అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్ట్‌నర్‌షిప్) కార్యక్రమాన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్న స్వర్ణాంధ్ర ఫౌండేషన్ పీ4 ఎన్నారై ప్రతినిధి మహమ్మద్ ఆరీఫ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. పీ4 కార్యక్రమ లక్ష్యాల సాధనకు ఆయన చేస్తున్న కృషి, చూపుతున్న అంకితభావాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
అంతర్జాతీయ వేదికలపై పీ4కు విస్తృత ప్రచారం
పీ4 కార్యక్రమ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి చేరువ చేయాలనే సంకల్పంతో మహమ్మద్ ఆరీఫ్ అంతర్జాతీయ వేదికలు, జాతీయ సదస్సులు, సమ్మిట్‌లు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ పీ4పై అవగాహన కల్పిస్తున్నారు. పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఎన్నారైలను ప్రోత్సహించడం, కార్పొరేట్ సంస్థలను సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలనలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం
పేద కుటుంబాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడంతోపాటు, సొంతంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకునేలా ప్రోత్సహించేందుకు “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నారైలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర భాగస్వాములను పీ4 కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నారు.
2029 నాటికి పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అభినందించి ప్రోత్సహించడం తనకు మరింత బాధ్యతతో పనిచేసేందుకు స్ఫూర్తినిచ్చిందని మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. పీ4 లక్ష్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ద్వారా 2029 నాటికి పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ లక్ష్య సాధనకు తన వంతు కృషిని కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.

