–బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం
–స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం దక్కాలి: నల్లబోతుల నాగరాజు
సలాం ప్రొద్దుటూరు:
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోందని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు తెలిపారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ఈ నిర్ణయం కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ను 24 శాతానికి తగ్గించడం వల్ల రాజకీయంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కలేదని నాగరాజు విమర్శించారు. బీసీలు రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ, వారి జనాభాకు అనుగుణంగా రాజకీయ అవకాశాలు లభించలేదన్నారు.ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం బీసీల రాజకీయ సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నుంచి చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల వరకు బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.టీడీపీకి బీసీలు ఎప్పటి నుంచో వెన్నెముకగా నిలుస్తున్నారని, బీసీలను రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లడం తమ బాధ్యత అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నారని నాగరాజు గుర్తు చేశారు. నారా లోకేశ్ సైతం బీసీల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
“34 శాతం రిజర్వేషన్ బీసీల రాజకీయ భవిష్యత్తుకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ప్రొద్దుటూరు లో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నందున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి మరిన్ని అవకాశాలు లభించాలి. బీసీలంతా ఐక్యంగా ఉండి టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాం” అని నల్లబోతుల నాగరాజు తెలిపారు.బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, బీసీల రాజకీయ సాధికారత మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
