–స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధం – జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా
సలాం ప్రొద్దుటూరు (వేంపల్లి):
కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని 13వ వార్డులో పలువురు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొత్త సభ్యులను పార్టీ కండువా కప్పి సభ్యత్వ పత్రాలు అందజేసి ఆహ్వానించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు దాదా పీర్ తెలిపారు.
పార్టీలో చేరిన వారిలో అనిల్ కుమార్, హేమావతి, అశోక్ ఉన్నారు. ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్ధమవుతోందని తెలిపారు. 2014 నుంచి వేంపల్లి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ నిరంతరం ప్రజా సేవ చేస్తోందని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
“మన వార్డు, మన వీధి, మన ఊరి అభివృద్ధి కోసం ప్రతి ఇంటి నుంచి యువత ప్రజాసేవలో భాగస్వాములు కావాలి. మార్పు రావాలంటే మనమే ముందడుగు వేయాలి” అని రహమతుల్లా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆప్ మండల సభ్యులు ఎస్ఎండీ గౌస్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
