–594 మార్కులతో మెరిసిన అదోని విద్యార్థి..
–షైనింగ్ స్టార్ అవార్డుతో రాష్ట్ర స్థాయి గౌరవం
సలాం ప్రొద్దుటూరు (అదోని/కర్నూలు):
కృషి, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటగలరని అదోనికి చెందిన సయ్యద్ సాహెబ్ ఖాద్రీ మరోసారి నిరూపించారు. అస్తానా-ఎ-తాహిర్ షా ఖాద్రీ పీఠాధిపతి సయ్యద్ నవాజ్ పాషా ఖాద్రీ కుమారుడైన ఆయన, పదో తరగతి ప్రభుత్వ పరీక్షల్లో 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న **”షైనింగ్ స్టార్స్ అవార్డు–2026″**కు ఎంపికయ్యారు.
అదోనిలోని కిడ్డీస్ రూట్స్ గ్లోబల్ స్కూల్లో చదువుతున్న సయ్యద్ సాహెబ్ ఖాద్రీ తన అద్భుత ప్రతిభతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ ఏడాది అదోని నుంచి షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపికైన పది మంది విద్యార్థుల్లో కిడ్డీస్ రూట్స్ గ్లోబల్ స్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఉండటం ఆ విద్యాసంస్థ విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచింది.
జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్ అవార్డుల-2026 ప్రదానోత్సవం కర్నూలు జిల్లా పెద్దపాడు సమీపంలోని పుష్పరాజ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ, “విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. నేటి విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తు” అని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని కొనియాడారు.
సయ్యద్ సాహెబ్ ఖాద్రీ సాధించిన ఈ విశిష్ట విజయంపై కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, మతపెద్దలు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి అదోని పట్టణానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ జి. లాలెప్ప, డీసీఓ గీత, ఉప విద్యాశాఖ అధికారి శ్రీధర్ బాబు, జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
