–మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
సలాం ప్రొద్దుటూరు ( జమ్మలమడుగు):
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం చిన్నకొమర్ల గ్రామంలో ఉన్న దాల్మియా సిమెంట్ ప్లాంట్‌లో రూ.3,478 కోట్ల వ్యయంతో చేపట్టనున్న లైన్–2 విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 15న రాష్ట్ర విద్య, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తో కలిసి ప్లాంట్ విస్తరణ చేపట్టనున్న ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్, కార్యక్రమం జరిగే ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మంత్రి భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించే ప్రాంతంతో పాటు సమావేశ హాలు, ఎక్స్‌పీరియన్స్ జోన్, మంత్రి, వీఐపీల కోసం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ రూములు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, రిఫ్రెష్‌మెంట్, డైనింగ్ హాళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే భద్రత, పార్కింగ్, గ్యాలరీ, సీటింగ్, మీటింగ్ డయాస్, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం ప్లాంట్ అతిథి గృహంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్, అగ్నిమాపక, వైద్య, ఆర్‌డబ్ల్యూఎస్‌తో పాటు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
అంతకుముందు జమ్మలమడుగు సమీపంలోని కర్మలవారిపల్లిలో మంత్రి నారా లోకేష్ బస చేయనున్న ప్రాంతాన్ని కూడా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే కలిసి పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యువ నాయకుడు భూపేష్ రెడ్డి, దాల్మియా ప్లాంట్ హెడ్ అర్పన్ కుమార్ పరెక్, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు ఆర్డీవోలు, సబ్ కలెక్టర్ జాన్ ఇర్విన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
