ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్కార్డు మార్చి..ఖాతా ఖాళీ ..!

కార్డు మార్చి..ఖాతా ఖాళీ ..!

📰 Generate e-Paper Clip

 

–ఏటీఎం కార్డు మార్చి రూ.50 వేలు స్వాహా
నిందితుడి అరెస్ట్‌..

–ఆరు నకిలీ కార్డులు స్వాధీనం

సలాం ప్రొద్దుటూరు:

ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బు డ్రా చేసేందుకు వచ్చే వృద్ధులు, చదువురాని వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏటీఎంలో డబ్బు డ్రా చేయడంలో సాయం చేస్తానంటూ నమ్మించి.. అసలు ఏటీఎం కార్డును చాకచక్యంగా మార్చి నకిలీ కార్డు చేతిలో పెట్టి పంపించేవాడు. అనంతరం పిన్‌ నంబర్‌ తెలుసుకుని వారి ఖాతాల నుంచి నగదు డ్రా చేసేవాడు. నిందితుడి వద్ద నుంచి రూ.50 వేల నగదు, సెల్‌ఫోన్‌, ఆరు నకిలీ ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్‌ వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా కృష్ణాపురం మండలం వెల్దుర్తికి చెందిన దండనగారి సిద్ధేష్‌ అలియాస్‌ సిద్ధు.. గాంధీరోడ్డులోని స్టేట్‌ బ్యాంక్‌ ప్రాంగణంలోని ఏటీఎం కేంద్రం వద్ద మాటువేసేవాడు. ఏటీఎంకు వచ్చే వృద్ధులు, చదువురాని వారిని గమనించి.. వారికి డబ్బు డ్రా చేయడంలో సాయం చేస్తున్నట్లు నటించేవాడు.

డబ్బు డ్రా చేసిన అనంతరం ఏటీఎం కార్డును బాధితులకు తిరిగి ఇచ్చే సమయంలో చాకచక్యంగా అసలు కార్డును తన వద్ద ఉంచుకుని.. నకిలీ ఏటీఎం కార్డును వారి చేతిలో పెట్టి పంపించేవాడు. అంతకుముందే పిన్‌ నంబర్‌ను గుర్తు పెట్టుకునేవాడు. బాధితులు వెళ్లిన వెంటనే అసలు కార్డుతో వారి ఖాతాల నుంచి నగదు డ్రా చేసుకునేవాడు.

రిటైర్డ్‌ టీచర్‌ ఖాతా నుంచి రూ.50 వేలు

ఈ క్రమంలో ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు దిన్నెపాటి నారాయణ కూడా సిద్ధేష్‌ చేతిలో మోసపోయారు. ఆయన ఏటీఎం కార్డును  నిందితుడు మార్చేశాడు.. బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్‌ వద్ద నిందితుడు ఉన్నట్లు గుర్తించిన వన్‌టౌన్‌ సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి అతడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిద్ధేష్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!