-6 మంది క్రికెట్ బుకీలు అరెస్ట్
-అరెస్టు వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు ఏ ఎస్ పి విభూ కృష్ణ
సలాం ప్రొద్దుటూరు : పొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి ఆరుగురు బుకీలను అరెస్ట్ చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో 12 మందిపై ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. క్రికెట్ బుకీల అరెస్ట్ వివరాలను మంగళవారం సాయంత్రం ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహణపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఎర్రగుంట్ల-జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో క్రికెట్ బుకీలు ఉన్నారని సమాచారం రావడంతో వన్ టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐఐలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ప్రొద్దుటూరు మండలంలోని కామనూరు గ్రామానికి చెందిన గోపిరెడ్డి సుదీప్ రెడ్డి పాటు అశోక్ కుమార్ రెడ్డి, ఆకుల పవన్ నరసింహులు, షేక్ నాగ మస్తాన్ వల్లి, మూలి వెంకటేష్, పొట్టిపాటి శ్రీనివాసులు రెడ్డి లు ఐఫీఎల్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన బెట్టింగ్ లావాదేవీలను చూసుకుంటూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుదీప్ రెడ్డికి చెందిన ల్యాప్టాప్, మొబైల్ పోన్లను పరిశీలించగా బెట్టింగ్ యాప్స్ యూజర్ ఐడీలు, యూఆర్ఎల్ లింకులను బుకీలకు పంపించి వందేలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఇతను ఇతర బకీలతో కలసి విద్యార్థులు, ప్రజల నుంచి పందేల కోసం డబ్బు తీసుకుంటూ వ్యవస్తీకృత ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి వద్ద నుంచి రూ. 2.20 లక్షలు నగదు, హెచ్పీ ల్యాప్టాప్, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుకీలకు చెందిన 18 అకౌంట్లలోని రూ. 4.14 లక్షలను ఫ్రీజ్ చేశారు. వీరికి వివిధ ప్రాంతాలకు చెందిన మరో 12 మందితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారాల చిన్న, జగదీష్, తేజ, ధర్మారెడ్డి, వీరభద్రుడు అలియాస్ బద్రి, మౌర్య వర్ధన్ రెడ్డి, రాఘవేంద్రాచారి, రవీంద్ర, సన, హరీష్, సూరి రాయల్, సురేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. వ్యవస్తీకృత నేరాలకు పాల్పడితే సహించేది లేదని ఏఎస్పీ అన్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన |వన్డేన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐలు ఎస్ శ్రీనివాసులు, జి మధుసూదన్ రెడ్డి, సిబ్బంది లాల్ పీర్, రామచంద్రలను ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు. వీరికి ప్రత్యేక రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు..
