–రాయలసీమను ‘రైజింగ్ సీమ’గా తీర్చిదిద్దుతున్నాం
– జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత
సలాం ప్రొద్దుటూరు:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు. రాయలసీమకు భారీగా పరిశ్రమలు తరలివస్తుండటంతో యువతకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.ప్రొద్దుటూరులో రూ.30 వేల కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం శ్రీకారం చుట్టిన సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. ఒకప్పుడు రాళ్లు తేలిన రాయలసీమగా పేరున్న ప్రాంతం.. కూటమి ప్రభుత్వ పాలనలో నేడు ‘రైజింగ్ సీమ’గా ఆవిర్భవిస్తోందన్నారు.
పారిశ్రామిక, ఇంధన హబ్‌గా రాయలసీమ
రాయలసీమ జిల్లాలను పారిశ్రామిక, ఇంధన హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ఇటీవలే సుమారు రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. భారీ పరిశ్రమలు, పెట్టుబడులు రావడంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని సవిత పేర్కొన్నారు. ‘పల్లె పండుగ’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు
ప్రస్తుతం రూ.30 వేల కోట్లకు పైగా వ్యయంతో అమరజీవి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల పరిశుద్ధమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అమరజీవి జలధార కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తూ రాయలసీమను మరింత ప్రగతిపథంలో నడిపిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
