
–ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
సలాం ప్రొద్దుటూరు:
మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కార్మికుల హక్కులు, వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లను ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావించారు.ప్రధానంగా మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను రద్దు చేయాలని, హైకోర్టు ఆదేశాల మేరకు ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఆప్కాస్ కార్మికులకు రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, నెలకు రూ.10 వేల పింఛన్ అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరారు. 12వ పీఆర్సీని అమలు చేసి ఆప్కాస్ కార్మికుల వేతనాలను పెంచాలని, కోవిడ్ సమయంలో సేవలందించిన కార్మికులకు ఎస్ఎస్ రేట్ల ప్రకారం రూ.18,500 వేతనం చెల్లించి వారిని ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.రెండేళ్లుగా యూనిఫామ్‌లు ఇవ్వలేదని, వెంటనే యూనిఫామ్‌లు అందించాలని కోరారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు తదితర సామగ్రిని అందించాలని, కార్మికులకు అవసరమైన పనిముట్లు, తోపుడు బండ్లు, ఇంటింటి చెత్త సేకరణ డబ్బాలు, పారిశుద్ధ్య పరికరాలు సమకూర్చాలని కోరారు. మరమ్మతులకు గురైన వాహనాలను త్వరగా రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు.సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున సమ్మె చేపట్టాల్సి వస్తుందని యూనియన్ నాయకులు హెచ్చరించారు.ధర్నాలో మున్సిపల్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్, పట్టణ అధ్యక్షుడు చంటి, కోశాధికారి రాఘవేంద్ర, రవికుమార్, గుర్రమ్మ, రమాదేవి, మోహన్, ఓబయ్య, సురేష్, శ్రీకాంత్‌తో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

