–రెండో శనివారం, ఆదివారం సైతం విధులకు హాజరు కావాలి
– మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
పింఛన్ నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 12, 13 తేదీలైన రెండో శనివారం, ఆదివారం రోజులను వర్కింగ్ డేస్‌గా ప్రకటిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలోని అన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న పింఛన్ నమోదు సిబ్బంది ఈ రెండు రోజుల్లో తప్పనిసరిగా విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, డేటా ధృవీకరణ, పెండింగ్ ప్రక్రియలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సూచించారు.పింఛన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. విధులకు గైర్హాజరు కావడం లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు.
ఆకస్మిక తనిఖీలు.. పనితీరుపై నిఘా
సచివాలయాల్లో సిబ్బంది హాజరు, పింఛన్ నమోదు ప్రక్రియ పురోగతి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టనున్నారు. ప్రజలకు సత్వర సేవలు అందేలా ప్రతి సచివాలయం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.విధులకు గైర్హాజరు కావడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం లేదా పింఛన్ ప్రక్రియలో జాప్యానికి కారణమయ్యే సిబ్బందిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ ప్రయోజనం సకాలంలో అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
