ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పేదల డబ్బు కాజేస్తే.. కమిషనర్‌ వేటు!

పేదల డబ్బు కాజేస్తే.. కమిషనర్‌ వేటు!

📰 Generate e-Paper Clip

 

–10 మంది వద్ద రూ.2,000 వసూలు.. ఇంటికెళ్లి మరీ తిరిగి ఇప్పించిన కమిషనర్‌

 

–వాట్సాప్‌ ఫిర్యాదుపై తక్షణ స్పందన.. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు తాఖీదు

 

“పేదల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా ఉపేక్షించేది లేదు” – తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌

 

సలాం  ప్రొద్దుటూరు:

పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడుతూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ స్పష్టం చేశారు. పేదల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును బాధితుల ఇళ్లకు వెళ్లి మరీ తిరిగి ఇప్పించి, సంబంధిత సిబ్బందిపై చర్యలకు శ్రీకారం చుట్టారు.ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకంలో అర్హులైనప్పటికీ పింఛన్‌ అందని లబ్ధిదారుల వివరాలను ఎన్టీఆర్‌ భరోసా పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. సెప్టెంబర్‌ 7 నుంచి 16వ తేదీ వరకు ఈ ప్రక్రియకు గడువు ఇచ్చారు.అయితే ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదు కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు వాట్సాప్‌ ద్వారా అందింది. ఫిర్యాదును తేలికగా తీసుకోకుండా వెంటనే రంగంలోకి దిగిన కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ చేపట్టి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.

 

10 మంది వద్ద రూ.200 చొప్పున వసూలు

 

విచారణలో 7వ వార్డు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ చెన్న సుదర్శన్‌ గత రెండు రోజులుగా 10 మంది లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.200 చొప్పున మొత్తం రూ.2,000 వసూలు చేసినట్లు వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.దీంతో తీవ్రంగా స్పందించిన కమిషనర్‌ అక్కడితో వ్యవహారాన్ని ముగించలేదు. బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, సంబంధిత వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ చేత వసూలు చేసిన మొత్తాన్ని లబ్ధిదారులకు తిరిగి ఇప్పించారు.తమ సిబ్బంది చేసిన తప్పిదానికి లబ్ధిదారుల ఎదుట కమిషనర్‌ స్వయంగా క్షమాపణలు చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 

వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు తాఖీదు

 

అక్రమ వసూళ్లపై 7వ వార్డు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ చెన్న సుదర్శన్‌కు వివరణ కోరుతూ కమిషనర్‌ తాఖీదు జారీ చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేసినా, అక్రమ వసూళ్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు సైతం నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

 

ప్రజల సొమ్ముకు రక్షణగా ఉంటాం”

 

ప్రభుత్వ పథకాలు పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్నవేనని, వాటి ప్రయోజనాల కోసం లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.ఒక్క వాట్సాప్‌ ఫిర్యాదుపై స్పందించి.. ఆకస్మిక తనిఖీ చేసి.. అక్రమ వసూళ్లను వెలుగులోకి తీసుకువచ్చి.. బాధితుల నగదును తిరిగి ఇప్పించి.. సంబంధిత సిబ్బందికి తాఖీదు జారీ చేసిన కమిషనర్‌ చర్యలపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!