–వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల పిలుపు
సలాం ప్రొద్దుటూరు:
మాజీ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ నెల 12న కడపలో నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పాలజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడారని తెలిపారు.
విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏచూరి, ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడారని, అనంతరం మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తగా ఎదిగారని గుర్తుచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా, అధ్యక్షుడిగా ఎన్నికై విద్యార్థుల సమస్యలపై పోరాడారని తెలిపారు. అనంతరం కార్మిక ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 12న కడపలోని ఉపాధ్యాయ భవన్‌లో ఉదయం 10 గంటలకు సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సదస్సు ప్రారంభమవుతుందని, ఏచూరి అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు.
కరపత్రాల విడుదల కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నోవా, సుజాత, లక్ష్మీ, ప్రియ, సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
