

–చైర్మన్ పదవికి నిల్.. కౌన్సిలర్ కు 13 నామినేషన్లు
–స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పురపాలక యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది.స్పెషల్ నోడల్ ఆఫీసర్ వెంకటపతి ఆధ్వర్యంలో, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు చైర్మన్ పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని, కౌన్సిలర్ పదవులకు సంబంధించి మొత్తం 13 నామినేషన్లు అందినట్లు కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు.
అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు
నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన ధ్రువపత్రాలను పొందేందుకు సింగిల్ విండో విధానంలో సదుపాయాలు కల్పించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూ సర్టిఫికెట్లకు సంబంధించిన సేవలను అందుబాటులో ఉంచారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.నామినేషన్లకు సంబంధించిన పత్రాలను నిబంధనల ప్రకారం భద్రపరుస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
17, 18 తేదీల్లోనూ నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 17, 18 తేదీల్లో కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలతో నామినేషన్లు దాఖలు చేయాలని అధికారులు సూచించారు.
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
ఎన్నికల సంఘం ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడం, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించడం, ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడం లక్ష్యంగా పురపాలక యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, నిష్పక్షపాత వైఖరికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
