SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 6:44 am Posted by : SALAM PRODDATUR

కలశాల శోభాయాత్రలు.. సాంస్కృతిక ప్రదర్శనలు!

 

–రెండో మైసూరుగా పేరొందిన ప్రొద్దుటూరులో వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

 

సలాం   ప్రొద్దుటూరు:

రెండో మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కలశోత్సవాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కలశాల శోభాయాత్రలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాటాలు, బాణసంచా కార్యక్రమాలు భక్తులను, పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నవగంగ తీర్థాలతో వాసవీమాతకు అభిషేకం

దసరా ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సుహాసినులు 102 మంది నవగంగ తీర్థాలతో కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి వాసవీమాతకు అభిషేకం నిర్వహించారు. చినవీరయ్య శెట్టి రచించిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి పురాణాన్ని ఊరేగింపుగా తీసుకురావడంతో ఉత్సవాలకు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

ఉత్సవాల్లో భాగంగా కర్ణాటక కళాకారుల చిలిపిలి బొమ్మల ప్రదర్శన, కోలాటాలు, నృత్యతరంగిణి ఫైన్ ఆర్ట్స్ బృందం ప్రదర్శనలు, పాలకొల్లు బ్యాండ్‌ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాణసంచా కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి.

వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

పట్టణంలోని శ్రీ లలితాదేవి, రతనాల వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, రాజరాజేశ్వరి, సత్యనారాయణస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.

పోలీసుల బందోబస్తు

ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్ రావు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రలు, ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవం కలగలిసిన దసరా ఉత్సవాల ప్రారంభంతో ప్రొద్దుటూరు పట్టణంలో పండుగ సందడి నెలకొంది.