SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 1:15 pm Posted by : SALAM PRODDATUR

ఎన్నికల కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి.. ప్రధాని మోదీ రాజీనామా చేయాలి

 

–టీబీ రోడ్డులో సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో

 

ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్

 

సలాం  ప్రొద్దుటూరు:

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం టీబీ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.రాస్తారోకోను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ప్రజల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఓటు హక్కును కోల్పోవడం ద్వారా ప్రజలు తమ ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే ఎన్నికల కమిషనర్‌ను సస్పెండ్ చేసి, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. ఈవీఎంల సాఫ్ట్‌వేర్‌ను మార్చి, ఏ గుర్తుకు ఓటు వేసినా బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని పరోక్షంగా డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహంతో ఉన్నారని, ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని, ఆందోళనకారులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని కోరారు.ఈ రాస్తారోకోలో సీఐటీయూ నాయకులు కే. సాల్మన్, ఎం. చంటి, రాఘవ, ఓబులేష్, బాలసుబ్బయ్య, ఐద్వా అధ్యక్షురాలు విజయమ్మ, డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడు మేరీ బాబు, దినేష్, వినీత్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై నిరసన తెలిపారు.