–మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతిపత్రం..
–మున్సిపల్ కార్యాలయం ఎదుట డ్రైవర్ల నిరసన
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేయడంతో పాటు, అక్టోబర్ 9న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట డ్రైవర్లు నిరసన తెలిపారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి వినతిపత్రం
ప్రొద్దుటూరులో నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మున్సిపల్ యూనియన్, సీఐటీయూ ప్రతినిధులు కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. మరణించిన ఆప్కాస్ కార్మికుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం కల్పించాలని, 60 ఏళ్లు పూర్తిచేసుకున్న కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు.ఆప్కాస్ కార్మికులకు పదవీ విరమణ సమయంలో రూ.5 లక్షల ప్రయోజనం అందించడంతో పాటు, నెలకు రూ.10 వేల పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 12వ పీఆర్సీని అమలు చేయాలని, కోవిడ్ సమయంలో సేవలందించిన కార్మికులకు నెలకు రూ.18,500 వేతనం చెల్లించి, వారిని ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ కార్మికుల వేతనాలను పెంచి, వారి ఆర్థిక భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట డ్రైవర్ల నిరసన
మున్సిపల్ వాహనాల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 9న ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో డ్రైవర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.వాహనాలకు సకాలంలో డీజిల్ సరఫరా చేయాలని, గేర్ ఆయిల్, లిఫ్ట్ ఆయిల్ అందించాలని, మరమ్మతులకు గురైన వాహనాలను వెంటనే బాగు చేయించాలని కోరారు. పాతబడిన టైర్ల స్థానంలో కొత్త టైర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి
మున్సిపల్ కార్మికులకు అవసరమైన పనిముట్లు అందించాలని, రెండేళ్లుగా ఇవ్వని యూనిఫాంలను వెంటనే పంపిణీ చేయాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు అందించాలని, ఐదు నెలలుగా సరఫరా కాని తురకపుల్లలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.మరణించిన పది మంది కార్మికుల కుటుంబాల్లో అర్హులైన ఒక్కొక్కరికి ఉద్యోగం కల్పించాలని, 60 ఏళ్లు పూర్తిచేసుకున్న కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పించి, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాలని కోరారు. కోవిడ్ కార్మికులకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఎస్ రేట్ల ప్రకారం నెలకు రూ.18,500 వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్
మున్సిపల్ కార్మికులు పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి అవసరమైన పనిముట్లు, వాహన సదుపాయాలు, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు కల్పించాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. కార్మికుల సమస్యలను సంబంధిత అధికారులు, ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
