–11 నుంచి 21 వరకు వైభవంగా ఉత్సవాలు.. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు
సలాం ప్రొద్దుటూరు:
పట్టణంలోని మెయిన్ బజార్ అమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి 136వ దసరా మహోత్సవాలను ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం అమ్మవారిశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల షెడ్యూల్ను వెల్లడించారు.
11న కలశాలతో ఉత్సవాలకు శ్రీకారం
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు 102 మంది ఆర్యవైశ్య సువాసినులు కలశాలతో అమ్మవారిశాల నుంచి బయలుదేరనున్నారు. శివాలయం నుంచి నవగంగ తీర్థాలను, తెల్లాకుల శివయ్యకు చెందిన నగరేశ్వరస్వామి దేవస్థానం నుంచి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి పురాణాన్ని తీసుకురానున్నారు. తొలిరోజు పాలకొల్లు బ్యాండ్, కర్ణాటక కళాకారుల చిలిపిలి బొమ్మల ప్రదర్శన, ప్రొద్దుటూరు నృత్య తరంగిణి ఫైన్ ఆర్ట్స్ వారి సాంస్కృతిక ప్రదర్శన, మోడంపల్లికి చెందిన కవిత బృందం కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
17న అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా బిందె సేవ
అమ్మవారి మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు బిందె సేవ గ్రామోత్సవం ప్రారంభం కానుంది. చిక్కమగళూరుకు చెందిన కళాకారుల ప్రదర్శనల నడుమ పట్టణ పురవీధుల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.
20న విజయదశమి వేడుకలు.. ప్రత్యేక ప్రదర్శనలు
విజయదశమి సందర్భంగా ఈ నెల 20వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు శమీ దర్శనం ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తొట్టి మెరువని కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సన్నాయి వాద్యం, ఈరోడ్ కళాకారుల డ్రమ్స్ ప్రదర్శన, హైదరాబాద్కు చెందిన రేలా రే రేలా కార్యక్రమం, స్క్రీన్, బటర్ఫ్లై, డ్రోన్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.అలాగే సుళ్లూరుపేటకు చెందిన మదీనా క్రాకర్స్ బాణసంచా ప్రదర్శన, విల్లిపురం కళాకారుల ఎల్ఈడీ మూవింగ్ తొట్టి ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. దొరసానిపల్లె శ్రీ హనుమాన్ భజన బృందం ఆధ్వర్యంలో చెక్కభజన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.
21న అమ్మవారి గ్రామోత్సవంతో ముగింపు
ఉత్సవాల చివరి రోజైన ఈ నెల 21వ తేదీ బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఎన్.ఆర్.పేటకు చెందిన తప్పెట్ల బృందం ప్రదర్శనతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగనుంది.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సభ ప్రతినిధులు కోరారు.ఈ విలేకరుల సమావేశంలో సభ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, ఇతర సభ సభ్యులు పాల్గొన్నారు.